Wednesday 6 February 2013

అంతు లేని ఆలోచనలు

                రోజూవారీ యాంత్రికజీవనంలో కొన్ని చిన్న చిన్న సంతోషాలు, జీవితాంతం గుర్తుంచుకోదగిన గుణపాఠాలు నేర్పిన సంఘటనలు.. వెరసి జీవితంలో ఈ బంధాలు, అనురాగాలు ఏవి శాశ్వతం కాదని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. అన్ని అశాశ్వతం అని తెలుసు కానీ ఒక వ్యక్తి అన్న
మాటల్ని తేలికగా తీసుకోలేము. అలా అని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే మనకు ఒరిగేది కూడా ఏమీ ఉండదు.
కానీ మానవుని మనసు కోతి కదా.. కోతి ఒక చిన్న కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు దూకినట్టు, మనసు అంతే...
అలసట అన్నది ఎరగకుండా ఆలోచనల అలల తాకిడితో నిత్యం సతమవుతూ ఉంటుంది.
                      అందుకే ధ్యానం చేయాలేమో.. కొన్ని నిముషాలైనా మనసుని ఆలోచనల నుంచి రక్షించడానికి..అందరికీ ఒక మనసు ఉంటుంది. ఎదుటి వారి మనసుని గాయపరిచేట్టు మాట్లాడుతాం కోపంలో, మళ్లీ మనసుని శాంతపరిచి ఆలోచిస్తే చేసిన తప్పు తెలుస్తుంది. కొంతమంది వెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. కానీ కొంతమంది అలా కోపంలో అరిచిన మాటల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఆ అరిచిన వ్యక్తిని జీవితంలో దగ్గరకు రానీయకపోవచ్చు. దీని వల్ల మనకెంత నష్టమో తెలుస్తుంది.
                                        *****************************************
                        అమ్మాయి అంటే అబ్బాయిల కాళ్ల దగ్గర సేవచేస్తూ పడకకి మాత్రమే అవసరమనుకుంటూ ఉంటారు కొంతమంది మహానుభావులు..తరాలు మారినా, యుగాలు మారినా ఈ వాక్యంలో ఎలాంటి మార్పు ఉండదు.భార్య,భర్త అంటే ఒక బండికి రెండు చక్రాలలాంటి వారు అని అంటారు.. మరి అలాంటప్పుడు ఒక చక్రంలో గాలి లేకుండా బండి నడపగలరా?? లేదు కదా, మరి ఒకరు అణిగి,మణిగి ఉండాలన్న ఆలోచన ఎందుకు పెట్టుకుంటారు మనసులో? నిజానికి ప్రతి విషయంలో అమ్మాయిల గెలుపుని హర్షించే పురుషులు ఉంటారా??ఎంత పైకి మద్దతు తెలిపినా లోపల మాత్రం అంట్లు తోముకోక నువ్వు ఆఫీసులో ఏం పీకుతావే?? అనే అభిప్రాయంలో ఉంటారు..
                       నాకు తెలిసినంత వరకు అబ్బాయిలకు కావలసింది ఏంటంటే ప్రతి విషయానికి ఎందుకు? అనే ప్రశ్న లేకుండా చెప్పిందల్లా వినే ఒక కుక్కపిల్ల లాంటి అమ్మాయి కావాలి. వేళకు అన్ని సమకూర్చిపెట్టి తను ఎన్ని అవమానాలకు గురిచేసినా తలొంచుకుని అన్ని భరించి ఇంట్లో బానిసలాగా పడుండే ఒక అమ్మాయి అయితేనే అబ్బాయిలకు నచ్చుతుంది. అలా కాదు అని గొంతు విప్పితే దేని దేనికో ముడిపెట్టి అసలు మనకు పుట్టిన పిల్లలు నా వల్లే పుట్టారా? లేదా ఇంకెవరితోనైనా తిరిగితే పుట్టారా అనే నీచపు మాటలు మాట్లాడి ఆ అమ్మాయి ఆత్మాభిమానం పైనా, మానం పైనా అనుమానం ప్రకటించిన ఇలాంటి కుక్కలకు ఏ న్యాయస్థానంలో ఎలాంటి శిక్షవేస్తే వాడి బుద్ధి మారుతుంది??
                      ఇప్పటి పరిస్థితుల్లో ఇన్ని అవమానాలు భరించి తన జీవితాన్ని నాశనం చేసుకుని అమ్మాయి బతుకుతుంది అంటే కుటుంబగౌరవం కాపాడాలన్న తాపత్రయం అయ్యుండొచ్చు. పిల్లల్ని అనాథలుగా వదిలివెళ్లే ధైర్యంలేక అయ్యుండొచ్చు. కానీ అదే సహనాన్ని పదే పదే పరీక్షపెడితే చివరికి కొంతకాలానికి అబ్బాయిలపైన ఆసిడ్ దాడి అనే వార్త వినాల్సివస్తుంది. ఈ పురుషాహంకార సమాజంలో బతుకుతున్నందుకు తలదించుకుంటున్నాను.ఈ అభిప్రాయం కలగడానికి నా జీవితంలో ఎదురైన సంఘటనలు కారణం. తప్పులు అందరూ చేస్తారు. కానీ కొంతమంది వాటిని సరిదిద్దుకుని జీవితంలో ముందుకెళ్తారు. కొంతమందికి ఆ ధైర్యంలేక ప్రాణాన్ని వదిలేసుకుంటారు. అలా ప్రాణాలను బలి తీసుకోవాలన్నంత బాధపెట్టి వాళ్ల చావుకి కారణమైన ప్రతిఒక్కరికి దేవుడి చేతిలో అంతకంటే పెద్ద శిక్ష పడుతుందనే ఆశతో....