Wednesday 12 June 2013

జియా మరణం

                 ఈ వార్త వినగానే నేను ఒకలాంటి బాధకు లోనయ్యాను. రంగురంగుల, జిలుగు వెలుగుల మధ్య ఉన్న సినిమా ఫీల్డ్ అంటేనే చాలా మందికి సదభిప్రాయం ఉండదు. సినిమా అంటే 24 కళలు కలిస్తినే ఉద్భవించేదే అయినా తెర పైన కనిపించే నటి,నటులనే ఎక్కువమంది ఆరాధిస్తారు.అందుకనే వీళ్లు ఏది చేసినా మీడియా చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుంది. 
               జియా మరణం గురించి తెలిసిన వెంటనే అందరు కూడా తన కెరీర్ పరంగా తనకి అవకాశలు లేవని దాని వల్ల కొంత నిరాశ,నిస్పృహలకు లోనయ్యి ఇలా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉంటుందనుకున్నారు.అప్పటికి తన మరణం పైన ఒక తెలుగు పేపర్ ప్రేమే ప్రాణం తీసిందా అనే అనుమానాన్ని వెలిబుచ్చింది. చివరికి ఆ అమ్మాయి ప్రేమవల్లే చనిపోయిందని తెలిసి చాలా బాధేసింది. అందరికి గుర్తుండే ఉంటుంది దివ్యభారతి కూడా ఇలాగే రాలిపోయిందని.అది కేవలం యాధృచ్చికంగానే జరిగినట్టు చిత్రించారు నాకు గుర్తున్నంత వరకు. 
                జియా మరణించిన వారం తర్వాత వాళ్లింట్లో తను చనిపోవడానికి కారణాన్ని విపులంగా వివరిస్తూ తన బాధనంత అక్షరాలుగా వ్రాసిన ఒక ఉత్తరం బయటపడింది.. నిన్న అది చదివిన వెంటనే కళ్ల నుండి తెలియకుండానే కన్నీళ్లు ఒలికిపోయాయి. శాస్త్రీయపరంగా అబ్బాయిల కన్నఅమ్మాయీలు కొంచెం ఎక్కువ సున్నితంగా ఉంటారు. అందులోనూ అబ్బాయిల కన్న తొందరగా నిరాశకు లోనయ్యే విధంగా మెదడులో నిర్మాణం జరిగిఉంటుంది. పుట్టుకతోనే దేవుడు కూడా అమ్మాయిలు ఎక్కువ బాధపడాలనే  ఇలా చేశాడేమో అనిపిస్తుంది.  
               ఆ అమ్మాయి ఉత్తరంలోంచి కొన్ని వాక్యాలు:
        నన్ను నేను కోల్పోయేంతగా నిన్ను ప్రేమించాను, కాని నువ్వు నా ప్రేమను నీ మోసం రూపంలో చూపించావు. నీ ప్రపంచం కేవలం అమ్మాయిలు, పార్టీలు చేసుకోవడము. నా ప్రపంచం మాత్రం నువ్వు, నీతో ఉన్న నా జీవితం. నేను ఇంకొక శ్వాస తీసుకోవడానికి నాకు ఏ కారణం కనిపించడం లేదు.నీ కోసం కన్నీరు కార్చిన  ప్రతిసారి నువ్వు దాన్ని చూసి నవ్వావు. నేను ఈ ప్రదేశాన్ని నా చెరిగిపోయిన నా కలలతో, విరిగిపోయిన మనసుతో వదిలి వెళ్తున్నాను. పడుకోవాలనుంది కానీ ఇక ఎప్పటికి ఆ నిద్రలోంచి మెళుకవ రానంతగా ....
                  

                    ఈ ఉత్తరం చదివిన వెంటనే చాలా బాధగా అనిపించింది. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించడం అంటే తనన్ అవసరానికి వాడుకుని వదిలేయడము కాదు కదా!! కానీ కొంతమందికి విచిత్రంగా అనిపించొచ్చు ప్రేమలో విఫలమైతే ప్రాణం తీసుకోవాలా అని, మరి ప్రేమించిన వ్యక్తినే ప్రాణం కన్న మిన్నగా ఆరాధిస్తున్నపుడు,జీవితం అంత విలువైనదిగా అనిపించదు. తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు జీవితం శూన్యంగా అనిపిస్తుంది. అలా అని ఆ శూన్యం నుంచి బయటపడకుండా దాంట్లోనే కూరుకుపోయి చావును ఆహ్వానించకూడదు. అమ్మాయిలు ఎంత సెలెబ్రిటీలు అయినా వాళ్ల మనసు మాత్రం ఒక సాధారణ అమ్మాయి మనసులానే ఉంటుంది. జియా వ్రాసిన వాక్యాలు చదివిన వెంటనే నాకావిషయం అర్థమైంది. ఆ అమ్మాయి చావడానికి చూపిన తెగువ జీవించడానికి చూపించుంటే ఆ అబ్బాయికి ఒక పాఠం నేర్పినట్టయ్యేది. తన ఆత్మకు శాంతి చేకురాలని..తను ఎక్కడున్న మనఃశ్శాంతి పొందాలని
                               

Saturday 8 June 2013

సీ 'రియల్' రాధమధు



                   ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా మీరు పూర్తిగా చదివిన పిమ్మట నను నిందించరాదని.. ఇది కేవలం ఒక సీరియల్ వీరాభిమానిగా వ్రాసుకుంటున్న అభిప్రాయాలేనని..ఏదో అభిమానముతో ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ చెప్పినా అవి మీ మనసులో పెట్టుకుని నా బ్లాగు పైకి దండయాత్రకు రారని ఆశిస్తూ...
చక్రవాకం అంటే గవాక్షమా?? :P
                 నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు ఋతురాగాలు అనే సీరియల్ డిడి-8లో ప్రసారమయ్యేదంట..ఎందుకంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడాలేదు.. సో మనకు అది ఔట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అన్నమాట..అప్పటికి మా ఫ్రెండ్సంతా మాట్లాడుకుంటున్నప్పుడు దీని గురించి ఎప్పుడైనా ప్రస్తావన వస్తే అందరు తెగ రెచ్చిపోయి చెప్పేవాళ్లు..అప్పుడు మ అమ్మ ఇలాంటి మంచి ధారావాహిక చూడనివ్వకుండా బాల్యాన్ని చిదిమేసిందని భాదపడేదాన్ని :(
                     ఇంక జీవితం ఋతురాగాల నుంచి చక్రవాకంలోకి మారింది..అంటే మేము ఎలిమెంటరి స్కూల్లోంచి హైస్కూల్లోకి వచ్చి..అబ్బో అక్కడి నుంచి మేము ఇంటర్మీడియట్ చదివి...అబ్బో ఇంజినీరింగ్లోకి కూడా వచ్చేశాము..మా హాస్టల్లో జనాలకి ఎంత పిచ్చి ఉండేదంటే మా రూంలోని కిటికీలోంచి  కనిపించే పక్క అపార్ట్మెంట్ గదిలో ఉన్న టి.వి లో వచ్చే ఈ సీరియల్ కోసం జనాలు పిచ్చ పిచ్చగా వచ్చి ఒకరు తదేక దృష్టితో చూసి మిగతా వాళ్లందరికి లైవ్ అప్డేట్లు ఇచ్చేవాళ్లు..అబ్బో అదో తుత్తి మా వాళ్లకి.. అయినా కూడా నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు..అయినా మనకు ఋతురాగాలి గురించే సరిగా తెలియనపుడు ఇంక చక్రవాకం ఏం అర్థమవుతుందిలే అనే భ్రమలో చాలా కాలం బ్రతికాను :P అదేదో ఋతురాగాలు,చక్రవాకం పార్ట్1,పార్ట్2ల్లాగా :)
మొగలిరేకుల వాసన ఇంక ఎమైనా మిగిలిందా?!
                       మావాళ్లు మాత్రం చక్రవాకం అంటే అర్థమేంటో అని ఓ గింజుకునేవాళ్లు..ఎందుకంటే మనకు తెలుగే అంతంతమాత్రంగా వచ్చు ఇంక ఇలాంటి గ్రాంథికపదాల గురించి చాలా సీరియస్ సమావేశాలు జరిగేవి..చివరికి తేల్చిందేంటి అంటే చక్రవాకం అంటే గవాక్షం అని, బండికి రెండు చక్రాలిలాగా ఉండాలి కాబట్టి ఆలుమగలు..అందుకని ఆ అర్థం వచ్చేలాగా పెట్టారని..అబ్బో మా వాళ్లు అనుకోని అర్థం లేవు..డిరైవ్ చేయని థియరీ లేదు..చివరికి టెన్షన్ తట్టుకోలేక మా సంస్కృతం సారిని మెల్లిగా అడిగేసారు.. పాపం సారు మంచివారు కాబట్టి అది ఒక పక్షి పేరని చెప్పగానే మా వాళ్లంతా అయినా సింబాలిక్గా పక్షి ఎగురుతుంది కదా సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు .. అప్పుడే అనుకున్నాం కదా అని భుజాలు తడిమేసుకున్నారు:)
          చక్రవాకం అయిపోయిందని మూగగా రోదించే జనాల కంటతడి చూడలేక ఈసారి  మొగలిరేకులని మొదలుపెట్టారు.. అప్పటికి మేము ఇంజినీరింగ్లోకి రావడంవల్ల ఇక అర్థాలకి పెద్ద సమావేశాలు జరగలేదు..అది కూడా విజయవంతంగా ఒక రెండో,మూడో వేల(అభిమానులు మన్నించాలి..మీరు ఇంకొక 3 వేలు జతచేసి ఆరువేలుగా చదువుకోగలరు)ఎపీసోడ్లు పూర్తి చేసుకుని ఈ మధ్యనే ఇక మొగలిరేకులు వాటి వాసన పూర్తిగా పోయిందని నిర్ధారించుకుని ముగింపు ఇచ్చారంట..కాని ఇది జెమిని టి.వి. మిగతా తన సీరియళ్ల టి.ఆర్.పి రేటుని పెంచడానికే ఇలా అర్ధాంతరంగా ఆపేశారని విశ్వసనీయవర్గాల భోగట్టా..:)  
                  ఇలా సీరియల్ బాధితురాలిని నేను కాదు అని సగర్వంగా చెప్పుకుంటున్న సమయంలో నాకు ఒక సీరియల్ తెగ నచ్చేసింది..అబ్బో అదేంటంటే అది జెమిని టి.వి లోది కాదు అది మాటివి ఛానెల్లో ప్రసారమయ్యేది-"రాధమధు". నేను టైటిల్ సాంగు వినే పెద్దాఆఆఆఆ అభిమానిని అయిపోయాను..చెప్పాలంటే అందులోని పాత్రలకి (Not vessels,characters :D) 
సీరియల్ కు కొత్త నిర్వచనం దీనివల్లే
కూడా..వాళ్ల పాత్రలను తీర్చిదిద్దిన తీరు అద్భుతం అండి.కథా,కథనం చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడా కక్ష్యలు,ప్రతీకారాలు,ఎత్తులు,పైఎత్తులు లాంటివి లేకుండా ఆహ్లాదంగా గడిచిపోతుంది.
ఈ సీరియల్ మొదలయ్యేటప్పుడు చివరిలో కథ అని యుద్ధనపూడి సులోచనారాణి అని వేసేవారు..సీరియల్ ఏమవుతుందా అని టెన్షన్ వచ్చినప్పుడల్లా ఆ పుస్తకమేదో కొనేసుకుని చదివేయాలి అని అనుకునేదాన్ని.ఈ సీరియల్ కు మాత్రం మ అమ్మ,నేను సంయుక్తంగా అభిమానులం అవ్వడంచేతా నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు లైవ్ అప్డేట్స్ ఇచ్చేది. నిజంగా సీరియళ్లకున్న గొప్ప లక్షణం ఏమంటే మనం ఏ ఎపిసోడ్ చూసినా కథ అర్థం కాదు అనే పెద్ద గందరగోళం లేకుండా ఒక రెండు,మూడూ నెలలకి కూడా కథలో పెద్ద మార్పుండదు కాబట్టి మనం ఏదో మిస్స్ అయ్యామన్న భావన ఉండదు. ఇలా అప్పుడు చదవాలనుకున్న సులోచనారాణి గారి ఈ సీరియల్ కు ఆధారమైన నవల "గిరిజాకళ్యాణం" నాకు ఈరోజు గూగుల్లో దొరికింది. ఎవరో పుణ్యాత్ములు..చక్కగా 270 పేజీలు స్కాన్ చేసి పెట్టారు..నేను నిన్న రాత్రి 11.30 మొదలుపెడితే ఇదిగో 3.50కి నవల పూర్తిగా చదవడమైంది..చదివిన ఆనందంలో అన్ని గుర్తొచ్చి ఇలా వ్రాశాను..

ఎంతో అర్థమైన వాక్యాలు కొన్ని ఆ పాటలోంచి ...
ఆగదేనాడు కాలము,
ఆగిన గడియారము...
కాలమే ఎంత సాగినా,
ఓటమవ్వదు విజయము...
ఓడినంతనె గెలుపుపై నమ్మకమే నే వదలను
నమ్మలేని విజయాని పై భ్రమలోనే గడపను
కెరటాలు కోటి సార్లు ఎగిరి,
గగనాన్ని నేల పైకి తేవా..
ఆ నింగి నేలా ఎదురెదురుగున్నా
రెంటికి సాధ్యమా వంతెనా!!!!..   
నవల లింకులు(ఎవరికి అభ్యంతరం కాదని అనుకుని)
గిరిజా కళ్యాణం-1
గిరిజా కళ్యాణం-2
  
                

Thursday 30 May 2013

నేను ఈరోజు

        మా ఊర్లో ప్రతి వైశాఖ మాసంలో వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చవితి రోజు రథోత్సవం జరుగుతుంది. దాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వీలు చేసుకుని మరీ వెళ్తుంటాం. ఈ సారి కూడా నేను మా ఊరు వెళ్లివచ్చాను. 
         ఇంటి దగ్గర ఒక నాలుగు రోజులు ఉండేసరికి ఇంటి పైన చాలా బెంగగా ఉంది. నేను హాస్టల్లో ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇప్పటికి ఇంటికి వెళ్లి వస్తే చాలా బెంగ. చదువుకునే సమయంలో అయితే మన స్నేహితులు, మనం చదవాల్సిన పాఠాలు అని బోలెడు పనులు ఉంటాయి కాబట్టి బాధపడటానికి అంత  తీరిక ఉండదు. మరి ఇప్పుడో అలా కాదు, బోలెడంత సమయం కదా.. అందులోనూ చదువుకునే రోజుల్లో అయితే ఎంత బెంగ ఉన్నా దాని  ప్రభావం చదువు పైన పడకుండా జాగ్రత్త పడేవాళ్లం.              
                పిచ్చుక గూళ్ల లాంటి ఒక గదిలో ముగ్గురం ఉంటాం. వీలయితే మా కళ్లు టి.వి కి, లేదంటే మా లాప్టాప్ స్క్రీన్లకు అప్పగిస్తాం.మొదట్లో ఇలా ఉండాలని తెలియక నేనే చాలా కబుర్లు చెప్పెసేదాన్ని.. కానీ మా రూములో ఉన్న మిగతా ఇద్దరికీ అది నచ్చలేదు.ఇక అప్పట్నుంచి నేను కూడా పెద్దగా మాట్లాడటం మానేసాను.అయినా మనసుకి నచ్చాలి మాట్లాడాలంటే.. ఏదో మొహమాటానికి పెదవుల పైన వికారపు నవ్వు నవ్వుతూ ఎంతసేపని నన్ను నేను కష్టపెట్టుకోవటం అని మాట్లాడటమే తగ్గించేసాను. ఆఫీసు నుంచి రూముకి రాగానే వీలయితే టి.వి చూడాలి, లేదంటే లాప్టాప్. ఇంతకు మించి ఒక్క పని ఉండదు. ఆశ్చర్యమేమంటే నేను ఇంటికి లాప్టాప్ తీసుకెళ్ళినా ఒకసారి తెరవడానికి కూడా సమయం దొరకలేదు, అంత తీరిక కుడా లేదు.  
                   ఉన్న నాలుగు రోజుల్లో మొదటిరోజు ప్రయాణపు బడలికతో విశ్రాంతి తీసుకుంటే, తరువాతి రోజు మా అమ్మ కజ్జికాయలు చేసే ప్రోగ్రామ్ పెట్టేసింది. ఆ పనితో ఆ రోజు గడిచిపోయింది.తరువాతి రోజు బూజులు దులపాలి పండగ కదా అని ఆ పనికి పూనుకుంది. మరీ అమ్మ ఒక్కత్తే కష్టపడుతుంటే మనం చూస్తూ ఉండలేము కాబట్టి ఆరోజు అలా గడిచింది. చివరి రోజు అంటా పండగ హడావుడి. ఆరోజు మళ్లీ బబ్బట్లు చేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాం.ఇలా నాలుగురోజులు తీరిక లేకుండా సెలవులు గడిచిపోయాయి.
               ప్రతిసారి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా ఉంటుంది. కానీ తిరిగివచ్చే రోజు ఏదో తెలియని బెంగ,బాధ మనసులో ఇంకా ఎన్ని రోజులు ఇలా అమ్మా,నాన్నలకు దూరంగా ఉండటం అని.ఉద్యోగం రాక మునుపు ఇంటి మీద బెంగ అన్నా కూడా ఇంట్లోవాళ్లు ఏమి కాదులేమ్మా!! బాగా చదువుకో అని చెప్పి కర్తవ్యo గుర్తుచేసేవారు. మ్మ్..ఇప్పుడు అంత బెంగగా అనిపిస్తే పంచుకోవడానికి దగ్గరి స్నేహితులు లేరు. ఇంట్లో వాళ్లని మాటిమాటికి ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టాడానికి మనసు రాదు. ఇక నా గోడు ఎవరైనా వింటారు అంటే అది నా దిండు మాత్రమే..
                  ఇక్కడ ఐదు రోజులు పని చేసి, రెండు రోజులు పని లేకుండా హాస్టల్లో ఏమి చేయాలో తోచక.. అసలెందుకు రా ఈ ఒంటరి ప్రాణానికి ఈ సెలవులు అని విసుగొస్తుంది,పోని  రెండురోజులు సెలవులున్నాయి కదా ఇంటికెల్దామా అంటే 12 గంటల సుదీర్ఘ ప్రయాణం. అంత దూరం ప్రతి వారం ప్రయాణం చేయలేను. నాకైతే నిజం చెప్పాలంటే ఏ డిగ్రీయో ఇంటిపట్టునే ఉండి చదివి, ఎలాగోలా కష్టపడి ఒక టీచరు ఉద్యోగం సంపాదించేసి సంతోషంగా రోజు ఇంటి నుంచే వెళ్తే ఎంత బావుండేదో అని అప్పుడప్పుడు పగటికలలు కంటూ ఉంటాను. అయినా ఇప్పుడు వేలకు వేలు సంపాదించి బ్రాండెడ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన నిజంగా సంతోషంగా ఉన్నట్టా?? అసలు రోజు అమ్మ చేతి కమ్మని వంట తింటూ.. ఇంటి నుంచే ఉదయం పదింటికి బయలుదేరి సాయంత్రం ఆరింటికల్లా మళ్లీ ఇల్లు చేరుకునే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు నా దృష్టిలో గొప్ప అదృష్టవంతులు. నేను ఎవర్నైనా చూసి ఈర్ష్య పడుతాను అంటే అసలు హాస్టల్ మొహమే మేము ఎరుగము అని కొంతమంది చెప్పినప్పుడు..ఈ ఇంటి మీద బెంగ ఎప్పటికి తగ్గుతుందో నాకర్థమవట్లేదు.ఈరోజే మళ్లీ సెలవు ఎప్పుడు పెట్టి ఇంటికి వెళ్లాలా అని ప్లాను వేసుకున్నాను. :)
                                       

Wednesday 22 May 2013

అనగనగా యువరాణి

                   మ్మ్ ఏంటో ఈ జీవితం చడి,చప్పుడు లేకుండా చప్పగా, అప్పుడప్పుడు కొన్ని కష్టాలతో.. అప్పుడప్పుడు జీవితం అంటే ఇంతేనా అని అనిపించే విధంగా సాగుతూ నిజం చెప్పాలంటే సాగుతూఊఊఊఊఊఊఊఊఉ ఉంది. ఏం చేస్తాం మనం కూడా దానితో పాటే సాగాలిగా...ఈ సాగింపు చర్య ఏంటీ అంటారా ?? మనం అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాలి మరి..
     అనగనగా ఒక పేద్ద సాఫ్ట్వేర్ కంపెనీ.. అందులోకి ఒక బుల్లి యువరాణి..ఎవరా అని బుర్ర బద్దలుకొట్టుకోకండీ(నేనే మరి)..మరేమో నేను యువరాణి కదా అందుకని నాకు మొదట్నుంచి ఆటలో అరటికాయ టైపులో అందరు చిన్న చిన్న పనులు చెప్పి నా చేతులు కందకుండా గారాభంగా చూసుకున్నారు..ఇలా యువరాణి వారు రోజు ఆటవిడుపు కోసం ఆఫీసుకు రావడం నచ్చని మంత్రివర్యులు(మెనేజరు) వారు మెల్లిగా ఈ విషయాన్ని రాజా(డెలివరి మెనేజరు) వారి చెవిలో ఊదేసారు. పాపం కొంచెం ఘాట్టిగానే ఊదారేమో చెవి కందిపోయి దానికి వెంటనే చర్య తీసుకునేలా హుకూం జారీ చేసారు..

             మరి యువరాణి వారికి ఈ విషయం తెలియగానే ఎలా స్పందిస్తారో అని రాజా వారు తటపటాయించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, యువరాణి!! మీరు ఆడి,ఆడీ పాడు చేసినది చాలు మా శీఘ్రగణనయంత్రమును..మీరు వెరక చోటికి వెళ్లి ఆడుకొనుము..(గూడార్థము మీరింకొక ఉద్యోగమును వెతుక్కొనుము అని)..వెంటనే వూహించని ఈ పరిణామమునకు యువరాణి కనులలో నుంచి జాలువారు అశ్రువులను నియంత్రించుకుని, నన్ను ఒక జట్టుతో కలిపి చూడుడి, నా ప్రతిభను చూపించెదను అని మంగమ్మ శపతమును పూనిన వెంటనే.. మిక్కిలి ఆనంద భరితుడైన రాజా వారు నన్ను ఒక గుంపులో చేర్చిరి..(ఏ గుంపు అనా మీ అనుమానం, నా లాంటి అరటికాయలందరి గుంపులో :) ) మీరు ఇప్పుడు అందరి చేతా పరీక్షంచబడి ఒకరి చేత ఎన్నుకోబడతారు..అయితే ఒక నియమము అని ఒక రహస్యమును నా చెవిలో వేసినారు..అది ఏమనగా ఒక్క 30 రోజులు మాత్రమే ఈ అవకాశముండును, మీరు ఎవరి చేతా ఎన్నుకోబడని యెడల మీరు వేరోక రాజ్యానికి తరలి వెళ్ల్లవలే అని కటినముగా చెప్పినారు..

            మిక్కిలి దుఃఖముతో యువరాణి అయిన నేను అప్పటి దాకా ఆడిన ఆటలు, చేసిన సాహస కృత్యాలు ఒకసారి నెమరు వేసుకుని అదిగినా వారందరికి అవే సమాధానాలు చెప్పి చెప్పి నాకు కలలో కూడా అవి మాత్రమే వచ్చుచుండెడివి కొన్ని దినములు.. :D ఇందులో నేను ఎదుర్కొన్న సమస్య ఏమనగా అందరూ నువ్వు ఏ సమయమునైనా నీ తిండి,నిద్ర మాని మరీ ఆడుకొనెదవా అని అడుగుచుండేవారు :( నేనసలే యువరాణిని అలా నేను ఆడలేనని కొంతమంది గుంపులో చేరలేకపోయాను. నాకున్న పరిఙ్ఞానముతో నేను ఒక గుంపులో చేరుటకు చాలా ఉత్సాహమును చూపి ఉంటిని.. ఆ విషయము కూడా మరిచిపోయి ఉంటిని,కానీ ఒక గుంపు యొక్క ప్రతినిధి వచ్చి మీరు ఆరోజు మాకు మాట ఇచ్చితిరి మా గుంపులో చేరెదమని.. ఆడిన మాట తప్పరాదు యువరాణి అని చెప్పడంతో హతాశురాలై నాకు ఇంకొక్క అవకాశం ఇచ్చిన నేను ఇంతకన్నను మంచి గుంపులో చేరెదను అని మొహమాటము లేకుండా చెప్పితిని.అయినను ఆ ప్రతినిధి నన్ను బలవంతముగా తమ గుంపులో చేర్చుకొనినారు.అప్పటివరకు నేను ఒక గాజుగదిలో ఉండేదాన్ని(private restricted area).అలాంటి నన్ను తెచ్చి ఒక గుంపులో కలిపి అందరితో పాటు రెండు కుర్చీల మధ్యలో ఇరికించి నువ్వు ఇక్కడే కుర్చోవాలి అని మొదటి ఆఙ్ఞ జారీ చేసారు..నా చేతిలో ఏమీ లేకపోవడంతో అలాగే కూర్చుని ఆ పరిసరాలకి అలవాటుపడుతూ ఉండగా నన్ను ఇంతకు ముందు గుంపు ప్రతినిధి పిలిచి నువ్వు వేరొక గుంపులో చేరితివి, అయినను ఇచ్చటనే కూర్చుని కాలక్షేపము చేయుచున్నావు. వెంటనే నువ్వు నీ గణనయంత్రమును మాకు అప్పగించి మీ గుంపుతో కలిసి కూర్చొనవలెను అని ఆఙ్ఞాపించిరి:(  అది కూడా రెండు దినములలో..దీని కొరకై మా గుంపు ప్రతినిధికి ఒక 20 లేఖలు(mails) పంపిరి.ఇక గతిలేక నేను ఆ చోటు ఖాళి చేసి నిరాశ,నిస్పృహలతో ఆ చోటుని విడిచి నా ఆటవస్తువులని అన్నిటిని సర్దుకుని కొత్త ప్రదేశానికి తరలి వచ్చితిని. కొత్త చోటు మరీ ఇబ్బందికరంగా ద్వారము మొదట్లో ఉండటం మూలంగా అటు,ఇటు తిరిగే వాళ్లు నా గణన యంత్రము వైపు ఒకసారి పరికించి వెడుతున్నారు,చాలా ఇబ్బందికరముగానున్నది. అంతేకాకుండా నాతొటి ఆడి, ముచ్చట్లు చెప్పే చెలికత్తె నాకు దూరముగానున్నది.   
               I miss my friend,place and that restricted private area :(
          వచ్చే జన్మలోనైనా ఇలా కాకుండా నిజంగా యువరాణిలా ఉండాలని అనుకుంటున్నాను..
         
                 

Wednesday 15 May 2013

మనసుల గారడీ(కథ)

                 పోద్దున్నే కళ్లు తెరవడానికి రావట్లేదు. రాత్రంతా ఏదో జరిగినదని తెలుస్తూనే ఉంది కానీ అది బుర్రలోకి వచ్చి అది కాస్తా కళ్లలోంచి సన్నటి నీటిధారగా బుగ్గల మీదుగా ఒలికిపోయింది
                     రాత్రి స్వప్నకు,వంశీకు మాట మాట పెరిగి ఇలా తను ఇంతలా బాధపడుతుంది అనుకుంటూ వంశీ అన్న మాటలకి జీవితం పైన విరక్తి కలిగి అప్పుడే బిల్డింగ్ పై నుంచి దూకో, ఫ్యాన్ కు ఉరేసుకునో చావాలనిపిస్తుంది. ఇదే శపథం రాత్రి వంశీ దగ్గర చేసినా తన నిస్సహాయతను, చేతకానితనాన్ని తలుచుకుని ఇంకా కృంగిపోయింది. చావాలనిపిస్తుంది కానీ అంత ధైర్యం లేదు. అలా అని రోజు ఈ మానసిక సంఘర్షణ అనుభవిస్తూ బతకాలని కూడా అనిపించట్లేదు. ఈ విషయం అమ్మ,నాన్నలతో చెప్పలేను, ఎందుకంటే వాళ్లకి అసలు వంశీ అంటే ఎవరో తెలియనే తెలియదు. ఇంక అక్కతో ఈ విషయం గురించి ఒకసారి చెప్పినా, నువ్వు ఏదైనా చేసేముందు నాకెందుకు చెప్పవూ అంది. ఎటు నుంచి చూసినా తప్పు నాదే స్పష్టంగా తెలుస్తుంది.
                     కళ్లు మూసుకుని ఒకసారి జరిగిన దాన్ని తలుచుకుంది. మార్చి  ఒకటో తేది..వంశీ పుట్టినరోజు, తను ఎంత బతిమిలాడినా వినకుండా నాకు ఇంట్లోనే పుట్టినరోజు చేసుకోవడం అలవాటు అని వెళ్లిపోయాడు, తన కోసం చేసిన గ్రీటింగ్ కార్డ్ కూడా తీసుకోకుండా నీ దగ్గర ఉంచుకో తర్వాత తీసుకుంటాను అని ట్రైన్లో నుంచి చేయి ఊపుతూ ఇంటికి వెళ్లిపోయాడు. మనసులో కొంచెం నిరాశగా అనిపించింది.మార్చి ఒకటో తేది అనుకోకుండా స్వప్న స్నేహితుడు వినయ్ ఏదో పని ఉండి స్వప్న ఆఫీసువైపు వచ్చి అలాగే తనని కలుస్తానని ఫోన్ చేసాడు.. వినయ్ అంటే చిన్నప్పటి తనతో పాటు కలిసి చదువుకున్న అబ్బాయి. ఈ మధ్య తను ఊరెళ్తే కనిపించి తను కూడా బెంగళూరులోనే ఉన్నానని చెప్పి ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
              ఇక అనుకోకుండా వస్తానని చెప్పడం వల్ల తను నేరుగా ఆఫీసు దగ్గరికి వచ్చి కలవమంది. తను రాగానే విజిటరుగా వాళ్ల క్యాంటీను వరకు తీసుకెళ్లింది అంతకు మించి ఏం చేయాలో అర్థమవక. ఆ తర్వాత వినయ్ చొరవగా ఇక్కడ దగ్గర్లో ఏదైనా థియేటరు ఉంటే సినిమాకు వెళ్దామా అని అనగానే, స్వప్న సంశయిస్తూనే సరే అంది. అది జరిగిన తర్వాత వినయ్ తన మైలు ఐడి ఇచ్చి కొద్ది సేపు మాట్లాడమని అడిగాడు. వంశీ గురించి తను కలిసినప్పుడు వివరంగా చెప్పినా తనతో చాట్ చేసేటప్పుడు తనంటే ఇష్టమని వినయ్ చెప్పాడు. స్వప్నకు ఏం చేయాలో పాలుపోలేదు.  నాకు చిన్నపటి నుంచే ఇష్టం , కానీ ఆ విషయం అప్పుడు చెప్పడనికి అంత వయసు లేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నా అని చెప్పాడు.ఈ విషయం అంతటితో వదిలేసి వినయ్ తో మామాలుగా మాట్లాడింది.వంశీ ఊరి నుంచి రాగానే వినయ్ కలిసాడని చెప్పింది కానీ తనతో పాటు సినిమాకి వెళ్లానని చెప్పలేకపోయింది.
                  ఒకరోజు వంశీ ఫోన్లో తన ఐడి, పాస్స్వర్దుతో మైలులోకి లాగిన్ అవడానికి ప్రయత్నించింది, కానీ  అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడంతో లాగిన్ అవలేకపోయింది. వంశీ,తను ఆరోజు రాత్రి భోజనం చేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. వంశీ ఇంటికి వెళ్లి తను మొబైలులో మైలు తెరవడానికి ప్రయత్నిస్తే స్వప్న మైలు తెరుచుకుంది, తెరుచుకోగానే ఏమున్నాయో అని చూసి, వెంటనే స్వప్నకు ఫోను చేసి వినయ్ ఎవరు? అని అడిగాడు, స్వప్న నువ్వు నా మైలు చూసావా అని అడిగింది?
                           వంశీ వెంటనే నీ లాగా ఎవరి బైకో ఎక్కి, వాళ్లతో సినిమాలు చూసే దాన్ని నేను పెళ్లిచేసుకోవాడానికి రెడీగా లేను అని ఆవేశంగా నేను ఇప్పుడే నీ మైలు, ఫోను నంబరు అన్ని బ్లాకు చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పటి దాక నేను నాకు అమ్మాయిల పైన నమ్మకం లేదని చెప్పేవాడిని, కానీ ఇప్పుడు చెప్తున్న నీ పైన నమ్మకం లేదు.స్వప్న తనదే తప్పని తెలుసుకుని వంశీ వాళ్ల ఆఫీసు దగ్గరికి వెళ్లి ఉదయం, సాయంత్రం తన కోసం చూసేది ప్రతిరోజు. తను చేసిన తప్పుకు క్షమించమని కాళ్ల మీద పడి వేడుకుంది. అదే విషయం వంశీతో చెప్తే కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయమేమి కాదు అని అన్నాడు.
      ఇంకొకరోజు వంశిని క్షమించమని  అడిగితే.. చూడు, నేను ఈరోజు మా ఆఫీసులో మా కోలీగ్లలో పదిమంది అమ్మాయిలని అడిగాను సినిమాకు వెళ్దామని, అందరూ ఎందుకు రావాలి నీతో అని అడిగారే కానీ నీలాగా అడిగిన వెంటనే ఎవరూ రాలేదు, అందరి అమ్మాయిలలోకి నీవే తేడా..ఆ విషయం ఇప్పటికైన తెలుసుకో అని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత స్వప్నకు చాలా బాధగా అనిపించింది. తను తొందరపడి చేసిన తప్పుకు జీవితాంతం శిక్ష పడిందనుకుంది, తను చేసిన తప్పు వల్ల జీవితాంతం తనతోపాటు కలిసి ఉండాల్సిన వ్యక్తిని కోల్పోయింది అని అనుక్షణం కృంగిపోతోంది.
                            ఈ కథలో నిజంగా స్వప్న తప్పు చేసిందా? స్వప్న అనుభవించే శిక్ష సరైందా?
                
                             

Wednesday 8 May 2013

సరదాగా---My Exam experience

                  జీవితం సాఫీగా,ఒకేరకమైన దినచర్యతో సాగిపోతుంటే ఏదో కోల్పోయామన్న భావం కలుగుతుంటుంది. అలా నేను కూడా రొటీన్ గా ఫీల్ అయ్యి మనం ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి బదులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే మన జీవితానికి ఇక ఏ ఢోకా ఉండదనుకుని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు ఏదో పిఓ ఉద్యోగాలకు ఒక పరీక్ష పెడుతున్నారని చివరాఖరి వారంలో తెలుసుకుని నేను తీరిగ్గా చివరి తేదికి ముందు దానికి అప్ప్లై చేశాను.
          అసలే మనం ఏం చేసినా దరిద్ర దేవత వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. సో నేను ఆన్ లైన్లో అప్ప్లై చేయగానే నాకు ఆ సైట్లో సమస్యుందని ఒక సందేశం నా కంప్యూటర్ పైన కనబడింది. అయినా మనకు ఇంక హాల్ టికెట్టు ఎలాగు రాదనుకుని ఊపిరి పీల్చుకున్నాను.. కొద్ది రోజుల తర్వాత నా బ్యాంకు అక్కౌంటులో డబ్బులు జమ కాకపోవడంతో ఏదో తేడా జరిగందనుకుని ఇంక ఆ విషయం అంతటితో మర్చిపోయాను.
           ఒక శనివారం మధ్యాహ్నం పని పాటా లేకుండా తీరిగ్గా ఏం చేయాలో తెలియక మా గది పైకప్పు వైపు చూస్తూ నిద్రలోకి జారుకుంటున్న సమయంలో నా మొబైల్ వైబ్రేట్ అయితే ఏదో మెస్సేజ్ వస్తే ఏదో పిచ్చి మెస్సేజ్ అని డిలీట్ చేయబోయి..ఎందుకో చూస్తే ఏముంది?!ఎస్.బి.ఐ వారి నుంచి హాల్ టిక్కెట్టు పంపించామని సందేశం. రెండు వారాల ముందు ఈ విషయం తెలిసినందుకు నవ్వాలో,ఏడ్వాలో అర్థమవక ఆ నిముషంలో నవ్వుకుని పుస్తకాలు దుమ్ము దులిపి చదవడం ప్రారంభించాను.
           ఇక పరీక్షకు చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఒకటే కలలు.. పరీక్ష సెంటరుకి ఆలస్యంగా వెళ్లానని.
ఎందుకంటే ఉదయం ఎనిమిదింటికి అని ఒక భయం..రోజు బారెడు పొద్దెక్కినా కళ్లు తెరవని నాకు ఆ భయంతో రోజు అలాంటి కలలే వచ్చేవి..:( ఎందుకైనా మంచిదని మా అమ్మకు ముందే చెప్పి పెట్టాను, ఎలా అయినా లేపమని..పరీక్ష ముందురోజు రాత్రి ఎంతసేపటికి నిద్రపట్టదు,ఒక లాంటి ఆతృత ఎగ్జాం ఎలా వ్రాస్తానా అని.. అయినా ఏమి ప్రిపేర్ అవ్వకుండా వ్రాసే నాకే ఇలా ఉంటే ఇంకా దాని కోసం రాత్రి,పగలు కష్టపడే వాళ్ల గురించి తలుచుకుని నా హంగామాకు తెగ నవ్వుకున్నాను.ఉదయం నాలుగింటికే లేచి ఒకసారి అన్ని మననం చేసుకుని తయారయ్యి చూస్తే ఎంతసేపటికి నేను ఎక్కవలసిన బస్సు రావట్లేదు :( మా స్టాపులోనే ఒక 25 మంది ఎక్కారు. అయినా ఈ సాఫ్టువేరుల పైన జనాలాకి ఎంత నమ్మకముందో అప్పుడు అర్థమైంది. నిలబడడానికి చోటు లేదు..అలా చచ్చి చెడి ఎగ్జాం సెంటరుకి చేరుకున్నాను..
               నేను పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు, రెండు వారాల ముందు చదివితే ఇలాగే ఉంటుందని నాకు నేనే ధైర్యం చెప్పుకుని వెళ్లాను. పరీక్ష సెంటరు దగ్గర అందరూ తెగ పుస్తాకాలు చదువుతున్నారు, నాకు అప్పుడే పరీక్ష పేపర్ ఏమైనా లీక్ అయ్యిందేమోనని అనిపించింది. నేను కూడా నా పక్క అమ్మాయి పేపర్లోకి తీక్షణంగా చూసాను, ఆ అమ్మాయి సరే అని నా వైపు ఒక జాలి చూపు విసిరి నాకే ఆ కాగితం ఇచ్చి చదివేసి ఇచ్చేయ్ అంది.  నా నంబరు ఉన్న గదికి వెళ్లి చూస్తే ఒక నంబరు తప్పుగా వేసి బోర్డు పైన అందరిని హడలగొట్టారు.
                              పరీక్షకి వెళ్లి చూస్తే అప్పటికప్పుడు చదివిన వాటిలోంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. అయినా ప్రశ్నాపత్రం ఇంత సులభంగా వస్తే మనకు ఇంత పోటిలో వస్తుందా అనే అనుమానం ఇప్పుడు...17 లక్షల మంది పోటిపడితే అందులో ఒక 4500 మందిని మాత్రమే తీసుకుంటారు, అయినా కానీ మనిషి ఆశజీవి అని అనడానికి నేనే ఒక ఉదాహరణ:)లేకపోతే ఈ లోకంలో మన మనుగడ కష్టమవుతుందెమో ఇలాంటి ఆలోచనతత్త్వం లేకపోతే కొన్ని  సమయాల్లో:) కానీ ఇంకా బాగా వ్రాసుండాలి అని అనిపించింది. ఏం చేస్తాం ఆ బుద్ధి ముందుండాలి కదా!!! 

Friday 1 March 2013

నేను బ్లాగుతూనే ఉంటాను


తిక్క కుదిరిందా??నాతో పెట్టుకుంటారా??

     ఏంటో ఈ మధ్య నువ్వు ఏదో సమాజాన్ని ఉద్ధరించేటట్టు ఆవేశంలో వ్రాసే నీ వ్రాతలు నువ్వు మాత్రమే మంచిదానివన్నట్టు ఉన్నాయి. అయినా బొమ్మకు ఒక వైపు మాత్రమే చూపి ఇంకొక వైపు చూపకపోతే బొరుసు లేదనుకుంటారు..(నా అంతు లేని ఆలోచనలు పోస్టుకు వచ్చిన ఒక మెచ్చుకోలు.)ఇది మరీ బాగుంది.. దానికి రెండోవైపు ఏముందో చూడకుండా ఉండటం మీ తప్పు.అంతే కానీ ఇలా నా బ్లాగు మీద పడి ఏడిస్తే ఏం లాభం ??
         ఈలాంటి మెచ్చుకోలు ప్రశంస విన్న తర్వాత నాకు కొన్ని అలోచనలు వచ్చాయి...వాటిలో అన్ని కాదు కొన్ని మాత్రమే.. అన్నీ వ్రాస్తే పరీక్షా హాల్లో ఇచ్చే మెయిన్ బుక్లెట్ 16 పేజీలు కూడా సరిపోవు
1. నిజంగా బ్లాగులో వ్రాసేదాంట్లో భావం ముఖ్యమా లేదా సంఘటన??
2. ఏదో ఊసుపోక కబుర్లు చెబుతూ నేను ఎవరినైనా బాధపెడుతున్నానా?
3. నా బ్లాగు వల్ల చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నానా?
4. విలువైన సమాచారం ఇవ్వనప్పుడు ఈ బ్లాగు ఎందుకు?
5. ఈ బ్లాగు వల్ల నిజంగా ఏవైనా ఉపయోగాలున్నాయా?
6. నా బ్లాగులో ఇంటిగుట్టు రట్టు చేసే పోస్టులే ఎక్కువా? 
7. అందరితోనూ ఇలా బాహాటంగా అన్ని విషయాలు చెప్పుకుంటారా?? (హవ్వా..నలుగురు చదివితే నవ్విపోదురు గాక)
8. బ్లాగు వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు ఇది ఉండటం అవసరమా??
                      ఇంత మానసిక సంఘర్షణ తర్వాత బల్గేరియా బడి పాఠంలో ఇవేవి నేర్పకుండా బ్లాగును తయారుచేసుకోవడానికి అనుమతిస్తున్న మతి ఉన్నా లేని బ్లాగర్ వారినే పూర్తిగా బాధ్యత వహించవలసిందిగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడమైనది. దానికి సంబంధించిన కేసు పూర్వాపరాలు విచారణకు గాను మళ్లీ తర్వాతి పోస్టుకు వాయిదా వేయడమైనది. :D :D
                    హమ్మా.. లేదంటే పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నా బ్లాగునే మూయించేయాలని చూస్తారా!! అంతే
మీకు తప్పదు.. ఇప్పుడైనా అర్థమైందా?? బ్లాగర్ ఉన్నంతవరకూ నా బ్లాగ్ ఉంటుంది. మీరు చదివిన, చదివి వినిపించినా, చూసి తరించినా, నన్ను ఏడిపించినా.. మీరు ఏడ్చినా :D  :D
                   నా బ్లాగు చదివి నా పైన అక్షింతలు జల్లిన మా ప్రియమైన అక్కకు, స్నేహితు"రాళ్ళు" వనజ,కావ్య,బిందు,మాధవిలకు ఈ టపా అంకితమిస్తూ.. తలనొప్పికి జండూబామ్ వాడమని ఒక చిన్న సలహా
మీ మీద జాలితో...
గమనిక:
బల్గేరియా బడిపాఠాలు ఇక్కడ http://harekrishna1.blogspot.in/
బల్గేరియా బడి విద్యార్థిగా ఆ పాఠాలు సరిగ్గా నేర్చుకోనందుకు ఆండీగారికి క్షమాపణలు చెప్పుకుంటూ ..  

Wednesday 6 February 2013

అంతు లేని ఆలోచనలు

                రోజూవారీ యాంత్రికజీవనంలో కొన్ని చిన్న చిన్న సంతోషాలు, జీవితాంతం గుర్తుంచుకోదగిన గుణపాఠాలు నేర్పిన సంఘటనలు.. వెరసి జీవితంలో ఈ బంధాలు, అనురాగాలు ఏవి శాశ్వతం కాదని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. అన్ని అశాశ్వతం అని తెలుసు కానీ ఒక వ్యక్తి అన్న
మాటల్ని తేలికగా తీసుకోలేము. అలా అని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే మనకు ఒరిగేది కూడా ఏమీ ఉండదు.
కానీ మానవుని మనసు కోతి కదా.. కోతి ఒక చిన్న కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు దూకినట్టు, మనసు అంతే...
అలసట అన్నది ఎరగకుండా ఆలోచనల అలల తాకిడితో నిత్యం సతమవుతూ ఉంటుంది.
                      అందుకే ధ్యానం చేయాలేమో.. కొన్ని నిముషాలైనా మనసుని ఆలోచనల నుంచి రక్షించడానికి..అందరికీ ఒక మనసు ఉంటుంది. ఎదుటి వారి మనసుని గాయపరిచేట్టు మాట్లాడుతాం కోపంలో, మళ్లీ మనసుని శాంతపరిచి ఆలోచిస్తే చేసిన తప్పు తెలుస్తుంది. కొంతమంది వెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. కానీ కొంతమంది అలా కోపంలో అరిచిన మాటల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఆ అరిచిన వ్యక్తిని జీవితంలో దగ్గరకు రానీయకపోవచ్చు. దీని వల్ల మనకెంత నష్టమో తెలుస్తుంది.
                                        *****************************************
                        అమ్మాయి అంటే అబ్బాయిల కాళ్ల దగ్గర సేవచేస్తూ పడకకి మాత్రమే అవసరమనుకుంటూ ఉంటారు కొంతమంది మహానుభావులు..తరాలు మారినా, యుగాలు మారినా ఈ వాక్యంలో ఎలాంటి మార్పు ఉండదు.భార్య,భర్త అంటే ఒక బండికి రెండు చక్రాలలాంటి వారు అని అంటారు.. మరి అలాంటప్పుడు ఒక చక్రంలో గాలి లేకుండా బండి నడపగలరా?? లేదు కదా, మరి ఒకరు అణిగి,మణిగి ఉండాలన్న ఆలోచన ఎందుకు పెట్టుకుంటారు మనసులో? నిజానికి ప్రతి విషయంలో అమ్మాయిల గెలుపుని హర్షించే పురుషులు ఉంటారా??ఎంత పైకి మద్దతు తెలిపినా లోపల మాత్రం అంట్లు తోముకోక నువ్వు ఆఫీసులో ఏం పీకుతావే?? అనే అభిప్రాయంలో ఉంటారు..
                       నాకు తెలిసినంత వరకు అబ్బాయిలకు కావలసింది ఏంటంటే ప్రతి విషయానికి ఎందుకు? అనే ప్రశ్న లేకుండా చెప్పిందల్లా వినే ఒక కుక్కపిల్ల లాంటి అమ్మాయి కావాలి. వేళకు అన్ని సమకూర్చిపెట్టి తను ఎన్ని అవమానాలకు గురిచేసినా తలొంచుకుని అన్ని భరించి ఇంట్లో బానిసలాగా పడుండే ఒక అమ్మాయి అయితేనే అబ్బాయిలకు నచ్చుతుంది. అలా కాదు అని గొంతు విప్పితే దేని దేనికో ముడిపెట్టి అసలు మనకు పుట్టిన పిల్లలు నా వల్లే పుట్టారా? లేదా ఇంకెవరితోనైనా తిరిగితే పుట్టారా అనే నీచపు మాటలు మాట్లాడి ఆ అమ్మాయి ఆత్మాభిమానం పైనా, మానం పైనా అనుమానం ప్రకటించిన ఇలాంటి కుక్కలకు ఏ న్యాయస్థానంలో ఎలాంటి శిక్షవేస్తే వాడి బుద్ధి మారుతుంది??
                      ఇప్పటి పరిస్థితుల్లో ఇన్ని అవమానాలు భరించి తన జీవితాన్ని నాశనం చేసుకుని అమ్మాయి బతుకుతుంది అంటే కుటుంబగౌరవం కాపాడాలన్న తాపత్రయం అయ్యుండొచ్చు. పిల్లల్ని అనాథలుగా వదిలివెళ్లే ధైర్యంలేక అయ్యుండొచ్చు. కానీ అదే సహనాన్ని పదే పదే పరీక్షపెడితే చివరికి కొంతకాలానికి అబ్బాయిలపైన ఆసిడ్ దాడి అనే వార్త వినాల్సివస్తుంది. ఈ పురుషాహంకార సమాజంలో బతుకుతున్నందుకు తలదించుకుంటున్నాను.ఈ అభిప్రాయం కలగడానికి నా జీవితంలో ఎదురైన సంఘటనలు కారణం. తప్పులు అందరూ చేస్తారు. కానీ కొంతమంది వాటిని సరిదిద్దుకుని జీవితంలో ముందుకెళ్తారు. కొంతమందికి ఆ ధైర్యంలేక ప్రాణాన్ని వదిలేసుకుంటారు. అలా ప్రాణాలను బలి తీసుకోవాలన్నంత బాధపెట్టి వాళ్ల చావుకి కారణమైన ప్రతిఒక్కరికి దేవుడి చేతిలో అంతకంటే పెద్ద శిక్ష పడుతుందనే ఆశతో....

Friday 25 January 2013

Live for Today

These are just some inspiring words and not written by me actually. I like words told here. It will be very helpful if we able to follow these words and need to be reminded in difficulties which makes us little sad and leave pain in heart. So here I am sharing with you...

There are two days in every week about which we should not worry.
Two days which should be kept free from fear and apprehension.

            One of these days is yesterday with its mistakes and cares,
            Its faults and blunders, Its aches and pains.
            Yesterday has passed forever beyond our control.
            All the money in the world cannot bring back yesterday.
            We cannot undo a single act we performed.
            We cannot erase a single word we said. Yesterday is gone.
           
           The other day we should not worry about is tomorrow.
            With its possible adversities, Its burdens,
            Its large promise and poor performance.
            Tomorrow is also beyond our immediate control.
            Tomorrow's Sun will rise, either in splendor or behind a mask
of
            clouds,  but it will rise.
            Until it does, we have no stake in tomorrow, for it is yet unborn.

            This just leaves only one day . . . Today.
            Any person can fight the battles of just one day.
            It is only when you and I add the burdens of those two
            awful eternity's - yesterday and tomorrow that we break down.

            It is not the experience of today that drives people mad.
            It is the remorse or bitterness for something which happened
            yesterday and the dread of what tomorrow may bring.

            Let us therefore live but one day at a time.
            Forget worries done in the past and dont get depressed by your future, that is out of our control.

Monday 14 January 2013

మా లోగిలిలో సంక్రాంతి

   ఈరోజు సంక్రాంతి మా లోగిలిలో ఇలా సందడి చేసింది. మా అమ్మ మాకు ఇచ్చిన ప్రశంస.. ఎంతసేపు ఆ లాప్టాప్
ముందు కూర్చోకపోతే కొంచెం మంచిది సాధన చేసి వేస్తే బాగుండేదేమో అని .. :P 
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. :)

                  

Friday 4 January 2013

నా ఆలోచనలు మాత్రమే

                                     జీవితంలో బాగా స్థిరపడి మంచి ఉద్యోగంలో చేరి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లి,తండ్రి వాళ్ల పిల్లలకు చిన్నప్పటి నుంచి నూరిపోసే మాటలు ఇవి. చిన్నప్పుడు బాగా చదివి, మంచి
మార్కులు తెచ్చుకుని కష్టపడి పై చదువులు చదివి తప్పటడుగు వేయబోయిన ప్రతిసారి అమ్మ,నాన్నల
శ్రమను, మన పైన ఉన్న కొండంతటి ఆశల్ని గుర్తు తెచ్చుకుని మళ్లీ మనసుని నియంత్రించుకుని సరైన
మార్గంలో నడుస్తూ సాగిస్తున్న ఈ  జీవన ప్రయాణంలో నేను ఎదుర్కొన్న అనుభవాలు...
                       అందవిహీనంగా ఉంటానని, చక్కని మాటలు పలుకుతున్నా నా గొంతుక మధురమైన
కోయిల పాటలా కాకుండా గార్ధభస్వరమని నా బాల్యంలో తోటి విద్యార్థులు చేసిన అవహేళన తలుచుకుని
అప్పటి నుండి ఇంకెవరితోనూ కలవకుండా, నా గొంతుక నుంచి మాట పెగల్చకుండా ఒంటరిగా ఆ పసి మనసు తల్లడిల్లితే దానిని ఎలా ఊరడించాలో తెలియక ఎందుకు నాకీ పుట్టుక అని అనిపించిన క్షణాన్ని నా మనసు
నుంచి ఎవరు చెరిపేయగలరు?? ఒక్క నా మరణం తప్ప!!! అప్పటి నా పసిమనసుకి అర్థమైన విషయం ఈ
లోకంలో బ్రతకడానికి కావాల్సిన అర్హతల్లో ముఖ్యమైనది.. అందమని!!
                     చదువులో ఎంత ముందంజ వేసినా సాటి విద్యార్థుల నుంచి వచ్చే అవహేళనలు, చీత్కారాలు..
నా హృదయాన్ని అమితంగా గాయపరిచాయి. పాతబడిన దుస్తుల్ని చూసి  అవహేళనగా  అరుస్తూ నా పేదరికాన్ని వెక్కిరించిన వాళ్ల సౌభాగ్యానికి బాధపడాలో, లేదంటే అమ్మని వెళ్లి ఎందుకు రోజు  ఇంత పాతబడిన బట్టల్ని వేసుకుంటున్నానని అడగాలో తెలీదు. అసలు మేము అలాంటి పరిస్థితుల్లో ఎందుకు బతుకుతున్నామో నిజంగా తెలియకుండానే నా బాల్యం గడిచింది.
                       ఇన్ని బాధల మధ్య నాకు తెలిసింది ఒక్కటే, చదవాలి అని!! చదివితే ఉద్యోగం
వస్తుంది,మంచి పేరు వస్తుంది. నేను అందంగా లేకపోయినా, నా స్వరం బాగోకపోయినా నన్ను అందరూ
గౌరవంగా చూస్తారు అనే ఒక గుడ్డి నమ్మకంతో చదివాను. ఇప్పుడు నన్ను చూసి మొహం పైనే ఎవరూ
మాటలు అని నన్ను కించపరచకపొయినా వెనకాల ఇంకా అవహేళనలు ఉన్నాయి. కానీ అవన్నీ
మనసులో ఒక న్యూనతా భావాన్ని బలపరిచాయి.
                   ఇంక కాలేజి స్నేహాలు దాదాపు డబ్బుతో  ముడిపడి అప్పటి దాకా తెలియని ఒక రంగుల
ప్రపంచం.ఇలా కాలేజిలో మాటి మాటికి జరిగే అట్టహాసంగా జరిగే పార్టీలకు వెళ్లకుండా ఉండేది, పొగరుతో
కాదని ఆ ఒక్క పార్టీకి ఇచ్చే డబ్బుకోసం అమ్మ,నాన్న ఎంత కష్టపడతారో చెప్పి వాళ్ల జాలి మాటలు
వినడం ఇష్టంలేక ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకు తిరిగేదాన్ని. దాన్ని వాళ్లంతా
ఎవరితో కలవడానికి ఇష్టపడని ఒక వింతజీవిగా భావించి మెల్లిగా ఇలాంటి విషయాల్లో నన్ను అడగడమే
మానేశారు. జీవితం నేర్పిన మరొక పాఠం నాకు, నా స్నేహితులకు మధ్య స్నేహం మనుగడకు
కావల్సినది డబ్బు అని ...           
              అందుకే స్నేహం ఏది ఆశించదు అన్న మాట విన్న ప్రతిసారి అదొక అతిశయోక్తిగా అనిపిస్తుంది.
కొంతమంది నన్ను తక్కువచేసి మాట్లాడి వాళ్ల స్నేహితుల ముందు నన్ను చిన్నబుచ్చిన సందర్భాలు
ఎన్నో.. అందుకే ఒకరితో స్నేహానికి వందసార్లు ఆలోచిస్తాను.. వాళ్ల జీవితంలో నేను వాళ్లకి సముద్రంలో
ఒక చిన్న నీటిబొట్టే కావొచ్చు, కానీ వారి స్నేహం నా జీవితానికి చాలా ముఖ్యమైనదని నాకు మాత్రమే
తెలుసు. స్నేహానికి కూడా పరపతి కావాలనే మనుషుల మధ్య ఉన్న నాకు  నా స్నేహంకోసం చేతులు
చాచే ప్రతిఒక్కరిని  చూస్తే చాలా అబ్బురంగా ఉంటుంది. కానీ మనసులో ఒక చిన్న ఆందోళన కుడా.. నా
 నుంచి వీళ్లు నిజంగానే ఏమి ఆశించట్లేదా అని? నిజజీవితంలోనే నాకు దొరకని స్నేహం ఇక
ముఖపుస్తకంలో, జి-మెయిల్ లో ఇచ్చే స్నేహాల్లో ఉంటుందని నేను నమ్మను ఖచ్చితంగా. అటువంటి
స్నేహాలు మళ్లీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్న తర్వాత కొనసాగుతాయన్న నమ్మకం నాకు లేదు.
నా జీవితం నాకు నేర్పిన పాఠం ఎవరితోనైనా ఎంత తొందరగా దగ్గరైతే, అంత తొందరగానే విడిపోతానని..
కొంతమంది వాళ్లకు నచ్చినట్టుగా నేను మారాలని ఆశిస్తారు. నన్ను నన్నుగా ఎందుకు స్వీకరించరో
అర్థం కాదు నాతో స్నేహమే ముఖ్యమైనపుడు. మొహం పైనే నచ్చని విషయాన్ని చెప్పకుండా వారి
వెనకాల దొంగచాటుగా నవ్వడం ఎంత వరకు కరెక్టో నాకర్థం కాదు.
            నా జ్ఞాపకాల తుట్టను కదిపితే కదిలిన తేనెలాంటి మధురమైన నా జీవితానుభవాలు.. అవెంత
మధురమో నా కంటి కనుపాప నుంచి జాలువారిన అశ్రువులు చెబుతున్నాయి..